ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గం టీడీపీకి బలమైన రాజకీయ స్థావరం. నందమూరి తారకరామారావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. కానీ కాలక్రమంలో అక్కడి పొలిటికల్ ముఖచిత్రం మారిపోయింది. కొడాలి నాని పేరు చెబితే గుర్తొచ్చేలా గుడివాడ ఆయనకు రాజకీయ అడ్డాగా మారింది.వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నానికి 2024 ఎన్నికల్లో ఎదురైన ఓటమి మాత్రం చాలా పెద్ద ఎదురుదెబ్బగానే నిలిచింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రూపంలో నానికి మరో కీలక పరీక్ష ఎదురవుతోంది. ఈ పోరులో గెలిచి తన పాత పట్టును ప్రూవ్ చేసుకోవాలని నాని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే ఇప్పుడు పురపోరులోనూ కొనసాగించాలని కూటమి వ్యూహాలను రచిస్తోంది.రెండో విడత మున్సిపల్ ఎన్నికల వల్ల ఏపీ వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థలపై దృష్టి ఉంటే.. ఆ 23లో గుడివాడ మాత్రం ప్రత్యేక చర్చకు కేంద్రంగా మారింది. అక్కడి పొలిటికల్ ప్రాధాన్యతతో పాటు కొడాలి నాని భవిష్యత్ రాజకీయ బలంపై సాగుతున్న చర్చ కూడా దీనికి కారణం. 2024 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని.. టీడీపీ తరఫున రెండుసార్లు, వైసీపీ తరఫున మరో రెండుసార్లు విజయాన్ని సాధించారు. అలాంటి నాయకుడికి మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో ఇప్పుడు లోకల్ బాడీ ఫలితాలు మరింత కీలకంగా మారాయి.నిజానికి గుడివాడ పొలిటికల్ హిస్టరీలో ఎన్టీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహించిన ఈ గుడివాడ నియోజకవర్గం చాలా కాలం టీడీపీకి బలమైన ప్రాంతంగా కొనసాగింది. అయితే కొడాలి నాని పొలిటికల్‌గా ఎదగడంతో మెల్లమెల్లగా అక్కడి సమీకరణాలు మారాయి. ప్రజల్లో తనకున్న పరిచయాలు, లోకల్ రాజకీయాలపై పట్టుతో వరుసగా విజయాలు సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు.కానీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీచిన కూటమి ఎఫెక్ట్ గుడివాడపైనా పడింది. నానికి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ద్వారా.. పట్టణ రాజకీయాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని కూటమి భావిస్తోంది.మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు గుడివాడ పాలిటిక్స్‌లో కీలక చర్చకు దారితీశాయి. నియోజకవర్గంలో టీడీపీ కూటమి భారీ ఆధిక్యం సాధించింది. ఏకంగా 97 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయం సాధించడం వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.ముఖ్యంగా నందివాడ మండలంలో వచ్చిన రిజల్ట్ పొలిటికల్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అక్కడ టీడీపీకి విజయం దక్కకపోయినా.. ఈసారి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం తాజాగా కూటమికి బలాన్నిచ్చింది. నియోజకవర్గంలోని 32 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలు కూడా టీడీపీ అకౌంట్లోకి వెళ్లిపోయాయి. ఈ పరిణామాలతో గుడివాడలో కొడాలి నాని ప్రభావం తగ్గుతోందా అనే ప్రశ్నలు స్థానికంగా మొదలయ్యాయి.అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొడాలి నాని ఎక్కడా కూడా అంత చురుగ్గా కనిపించలేదు. కేసులు, అనారోగ్య సమస్యల వల్ల నియోజకవర్గ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే లోకల్ ఎన్నికల సందడి మొదలవడంతో మళ్లీ రాజకీయంగా చురుకుగా అవడంతో పాటు.. గుడివాడలో తనకు ఇంకా బలం ఉందని నిరూపించుకోవాలనే టార్గెట్‌తో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ కూడా నాని వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థులకు తన బలాన్ని చూపించాలనే ప్రయత్నంగా దీనిని చెబుతున్నారు.గుడివాడ మున్సిపాలిటీలో సుమారు 12 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడం ఈసారి పోరును మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఇంతకాలం తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్‌లో వార్డుల వారీగా ఎవరి బలం ఎంత ఉందనేది అంచనా వేయడం పార్టీలకు సవాలుగా మారింది. గత అసెంబ్లీ, పరిషత్ ఎన్నికల రిజల్ట్ ఒక సూచన ఇచ్చినా.. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది.లోకల్ సమస్యలు, కేండిడేట్స్ వ్యక్తిగత పరిచయాలు, వార్డుల వారీగా ఉన్న సమీకరణాలు ఈ ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. గుడివాడలో తాగునీటి సమస్య పరిష్కారానికి చేసిన పనుల వల్ల తనకు ప్రజల్లో ఇంకా గుర్తింపు ఉందని కొడాలి నాని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా .. తన బలాన్ని మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిరూపించుకోవాలని చూస్తోంది.మొత్తానికి గుడివాడ పురపోరు సాధారణ లోకల్ ఎలక్షన్‌గా మిగిలేలా కనిపించడం లేదు. కొడాలి నాని పొలిటికల్ పునరాగమనానికి ఇది కీలక అవకాశం అవుతుందా? లేక అసెంబ్లీ, పరిషత్ ఎన్నికల విజయాల తర్వాత కూటమి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26వ తేదీ తర్వాత వెలువడే రిజల్ట్ గుడివాడ రాజకీయాల్లో తర్వాత దిశను కొంతవరకు నిర్ణయించనున్నాయి.
