బంగాళాఖాతంలో కదులుతున్న అక్వాన్ తుపాను తాజాగా ఏపీ తీరప్రాంత ప్రజలను తీవ్రంగా వణికించడానికి సిద్ధం అయింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి మరింత వేగంగా బలపడుతోంది.
ఇది బుధవారం అంటే నవంబర్ 18 వ తేదీకి తీవ్ర తుపానుగా, నవంబర్ 19 గురువారానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ , యానాం తీర ప్రాంతాల మధ్య ఎక్కడో ఒకచోట నేలను తాకే ఛాన్స్ కనిపిస్తోంది.
ప్రస్తుతం మచిలీపట్నానికి 670 కిలోమీటర్లు దూరంలో, చెన్నైకి 590 కి.మీ. దూరంలో ఉన్న అక్వాన్, నెమ్మదిగా వాయవ్య దిశగా అడుగులు వేస్తోంది. అయితే తీరం దాటే టైమ్‌కి దీని విశ్వరూపం కనిపించనుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ సమయంలో తీరప్రాంతంలో గంటకు 120 – 130 కి.మీ. వేగంతో భీకరమైన గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి ఏకంగా 145 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని దాటే ప్రమాదం కూడా ఉంది. నెల్లూరు నుంచి విశాఖపట్నం లేదంటే తుని మధ్యలో ఈ తుపాను క్రైసిస్ పాయింట్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ తీవ్ర పరిణామాల వల్ల నవంబర్ 18 బుధవారం నుంచే కోస్తాంధ్రవ్యాప్తంగా వర్షాల హోరు మొదలుకాబోతోంది. ముఖ్యంగా నవంబర్ 19వ తేదీ, 20 తేదీల్లో పరిస్థితి చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంది. చాలా చోట్ల 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ మోడ్‌లోకి వెళ్లారు.
ఉత్తరాంధ్రలోని విశాఖ పట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో వర్షాలు పడనున్నాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలను జారీ చేశారు. ప్రధాన ఓడరేవుల్లో ముందస్తు హెచ్చరిక జెండాలను ఎగురవేసి అలర్ట్ చేశారు.
