పాలిటిక్స్‌లో సైద్ధాంతిక విభేదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు చాలా కామన్. కానీ, ఒక ఇంట్లోని శుభకార్యానికి సంబంధించి శుభలేఖను అందించే సంప్రదాయాన్ని కూడా రాజకీయ రొచ్చులోకి లాగడం, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వల్గర్ కథనాలు రాయడం ఏమాత్రం సమర్థనీయం కాదనే చర్చ ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది.
తాజాగా తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అయితే, దీనిని అడ్డుపెట్టుకుని వైసీపీకి చెందిన న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎంతో ఆవేదనతో, తీవ్ర ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు.
ఒక వైపు సొంత చెల్లిగా, మరోవైపు ఒక సొసైటీలో ఉన్న ఆడబిడ్డగా తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఘాటుగా కామెంట్ల చేశారు. తన బిడ్డ పెళ్లికి ఒక పెద్దమనిషిని, తండ్రి వయసున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవడం రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆత్మీయంగా వెళ్లి కార్డు ఇస్తే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటూ చీప్‌గా అసభ్యకర రాతలు రాస్తారా అని నిలదీశారు.
మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు పెద్దలను, హోదాలో ముఖ్యమైనవారిని ఆహ్వానించడం మన తెలుగు సంస్కృతి. అలాంటిది తన కూతురి పెళ్లికి వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్లడాన్ని పట్టుకుని ఆడపిల్లల మానమర్యాదలతో ఆటలాడటం ఎలాంటి సంస్కారం అని షర్మిల ఫైర్ అయ్యారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు ,నాయకులు ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారడం పూర్తిగా ఖండించాల్సిన విషయమని స్పష్టం చేశారు.
గతంలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన పిల్లల పెళ్లిళ్లకు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాయకులకు, చంద్రబాబు నాయుడిని కూడా ఆత్మీయంగా కలిసి పెళ్లికి పిలిచారని షర్మిల గుర్తుచేశారు. మరి అప్పుడు కూడా ఇలాంటి నీచపు అర్థాలే తీశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
పొలిటికల్ కక్ష సాధింపు చర్యలకు, ఒకరిపై బురద చల్లడానికి ఇంట్లోని ఆడవాళ్లను, వారి పర్సనల్ జీవితాలను ఆయుధాలుగా వాడుకోవడం ఏమాత్రం తగదని షర్మి చెప్పారు. తమ సొంత బాబాయిలు, అన్నలు అని చెప్పుకునే వారే ఇద్దరు మహిళలను తల్లి, చెల్లిని టార్గెట్ చేస్తూ ఇలాంటి విషప్రచారం చేయించడం సొసైటీలో సభ్యత అనిపించుకోదని మండిపడ్డారు.
ఈ రకమైన డీ గ్రేడింగ్ జర్నలిజం, రోత రాతలు రాసే న్యూస్ పేపర్లు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయో ఆలోచించుకోవాలని షర్మిల అందరినీ సూటిగా ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని నాశనం చేయడానికి మీకున్న రోత బుద్ధిని ఇలా పేపర్ ముఖంగా ప్రదర్శిస్తున్నారా? ఒక ఆడపిల్లపై ఇలాంటి నిందలు వేయడమేనా మీ పత్రిక విధానం అని జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పత్రికా యంత్రాంగాన్ని షర్మిల సూటిగా ప్రశ్నించారు.
పొలిటికల్ గొడవలను ఎప్పుడైనా సరే మైదానంలో చూసుకోవాలి తప్ప, ఇంటి శుభకార్యాలను, ఆడపిల్లల గౌరవాన్ని రోడ్డున పడేసేలా ప్రవర్తించకూడదని షర్మిల క్లాస్ పీకారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న నాయకులు, మీడియా తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని ఆమె స్పష్టం చేశారు.తనకు దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల.
