సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్షలు, అధికారులతో టెలీ కాన్ఫరెన్సులకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్టుగా పొలాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇటీవల తుపాను సృష్టించిన బీభత్సంతో భారీగా నష్టపోయిన రైతన్నలను ఓదార్చడానికి, పంట బోదెలపై నడుస్తూ క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నష్టపోయిన పంటలను చూసి కన్నీరుమున్నీరవుతున్నరైతులకు తానున్నానంటూ బాబు ధైర్యం చెప్పారు. బురదమయమైన పొలాల్లో తిరుగుతూ నిజ పరిస్థితులను గమనిస్తూ జరిగిన నష్టాన్ని స్వయంగా అంచనా వేసి యంత్రాంగాన్ని పరుగెత్తించారు.
నిజానికి తుపాను హెచ్చరికలు వెలువడిన అక్టోబరు 27వ తేదీ నుంచే విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. అర్నబ్, మురసు వంటి వరస తుపానుల టైమ్లో రాత్రిపూట కూడా మేల్కొని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఉన్నతాధికారులతో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల పరిస్థితులపైన ఆరా తీశారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు అలాగే సహాయక చర్యల వేగంపై ఎప్పటికప్పుడు స్పష్టమైన గైడెన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విపత్తును ముందే పసిగట్టి నష్ట తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించారు.
అధికారులు పంపే అఫీషియల్ రిపోర్ట్లకే పరిమితం కాకుండా, ఇప్పుడు స్వయంగా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం ప్రత్యేకతగా నిలిచింది. కోనసీమ జిల్లా కాట్రేనికోన, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటించారు. అలాగే బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడి, గుంటూరు జిల్లా రేటూరు గ్రామాల్లో నీటమునిగిన వరి పొలాల్లోకి డైరెక్టుగా దిగి రైతుల కష్టాలను ఓపికగా విన్నారు. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత పంట నీట మునిగిపోయిందనే వివరాలను బాధితుల నుంచే సేకరించి, వెంటనే..వారికి సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించి రైతుల్లో నమ్మకాన్ని నింపారు.
