తన సినీ కెరీర్, క్లాస్ ఆఫ్ 80స్ రీ-యూనియన్ అనుభవాలు, అలాగే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాలను ఇంటర్వ్యూలో నటి ఖుష్బూ వెల్లడించింది. తెలుగు,తమిళ సినీ ఇండస్ట్రీలలో దశాబ్దాల తరబడి చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ఖుష్బూ సుందర్..తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా 80వ దశకపు నటీనటుల రీ-యూనియన్ గురించి మాట్లాడిన ఖుష్బూ.. తమ మధ్య ఉన్న అనుబంధం ఎంతో స్పెషల్ అని అన్నారు. క్లాస్ ఆఫ్ 80స్ పేరుతో 36 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని, దానిలో ప్రతిరోజూ అందరం మాట్లాడుకుంటామని చెప్పారు. ఈ గ్రూప్‌లో చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి చాలా మంది దిగ్గజాలు ఉన్నారని, తామంతా కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తామని చెప్పారు.
అయితే తెలుగులో వెంకటేష్ పక్కన కలియుగ పాండవులు (1986) సినిమాతో హీరోయిన్‌గా ఖుష్బూ పరిచయమయ్యారు. అయితే ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించలేకపోవడానికి గల కారణాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1988 నాటికి తమిళంలో తనకు చాలా ఎక్కువ ఆఫర్లు రావడం వల్ల అక్కడే బిజీ అయిపోయానని చెప్పారు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారిపోయిందని కానీ తాను చెన్నైలోనే ఉండిపోవడానికి ఇష్టపడటంతో తెలుగు ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘చంటి’ మూవీలో హీరోయిన్‌గా నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని, కానీ ఆ సమయంలో తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలకు అప్పటికే కాల్ షీట్లు ఇచ్చేయడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఖుష్బూ మనసులోని మాటలను షేర్ చేసుకున్నారు.
