ఎందుకు వదిలేయాలి ఇదే ప్రశ్న ఇప్పటి యువతరానిది. తరతరాలుగా అవినీతిని, మానిప్యులేషన్ని, రాజకీయ నాయకుల దొంగ వైఖరిని చూసి చూసి పాత తరాలకు అలవాటు అయిపోయింది. ఆఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసేది ఇదే కదా… 20 కోట్లు ఖర్చు పెట్టాడు సంపాదిందించుకోకుండా ఎలా ఉంటాడు. వాడెంత పనికిరాని వాడయినా మన కులపోడుకదా అనుకోవటం ఒక తరం పద్ధతి.
మన వృద్ధతరం అయితే మంచి చెడు చూసి నిర్ణయించుకునేవారు.. తప్పులు చేయాలంటే నాయకులు భయపడేవారు. దాచుకుని దాచుకుని దోచుకునేవారు. అది కూడా బట్టబయలు అయితే రాజీనామా చేయక తప్పదు. ఈ రెండు తరాలు ఒక టైప్ అయితే.. ఇప్పటి యువతరం మరో టైప్.
వాడు తిన్నది రూపాయేగా అని వదిలిపెట్టరు.. ఎందుకు వదిలేయాలి అంటూ తాట తీస్తున్నారు. ఆయన ఎంత పెద్ద నాయకుడు అయితే ఏంటి.. ఆయన ఏం చేసినా.. తప్పు అయితే జరిగిందిగా.. శిక్ష పడాలిగా.. ఎందుకు వదిలేయాలి? అంటున్నారు. అదే జెన్ జీ. ఉడుకు రక్తం, దూకుడు ఉన్నా.. అడిగే ప్రశ్నల్లో క్లారిటీ ఉంది. చేసే డిమాండ్లలో డోసు ఎక్కువైనా ఉద్యమం మాత్రం ఊర మాసే.
నీట్ పరీక్షా ప్రశ్నా పత్రాలు లీకేజీ కుంభకోణం.. పరీక్ష రద్దుతో చాలామంది విద్యార్ధులు, వారి ఫ్యామిలీలు అల్లాడిపోయారు. ఏళ్ల తరబడి చేసిన శ్రమ బూడిదపాలు అవటంతో రగిలిపోయారు. అయినా మౌనంగానే రోదించారు. విద్యార్ధిలోకమంతా దీనిపై తీవ్రంగా చర్చించుకుంది. కాని అది అంత ఆవేశంతో రోడ్డెక్కలేదు. కాని ఆవేశం అలాగే గుండెల్లో మండుతూనే ఉంది.
సరిగ్గా ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సంస్ధ వెలిసింది. ప్రకటనలన్నీ సోషల్ మీడియాలోనే.. అసలే రగిలిపోతున్న నవతరం గుండెలపై జస్ట్ అగ్గిపుల్ల గీశారంతే.. భగ్గున మండిపోయింది భారతదేశం. నిజం చెప్పాలంటే ఈ మంట దక్షిణాదికి అంతగా సెగ చూపించలేదు.
ఉత్తరాది మాత్రం ఊగిపోయింది. ఢిల్లీలో పిల్లలు కదం తొక్కారు. టెంత్ క్లాస్ లేదు.. ఇంటర్ లేదు.. డిగ్రీ లేదు.. ఇంజనీరింగ్ లేదు.. మెడిసిన్ లేదు.. అందరూ రోడ్డెక్కారు. ఎందుకంటే అందరికీ నష్టపోయిన విద్యార్ధుల జీవితాలను చూసినవారే. ఈ ఉద్యమానికి రాజకీయ రంగు అంటుకోలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. రూలింగ్ ప్రతిపక్షం అని లేకుండా అందరి పిల్లలు ఉద్యమించారు.
ఎంతలా అంటే పోలీసులను, లాఠీలను, తుపాకులను సైతం నివ్వెరపోయేలా చేశారు. తిరుగుబాటు అంటే ఇదిరా అని చూపించారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల కుటుంబాల వేదనను, రోదనను చూసినవారు వీరంతా. అందుకే అలా కదం తొక్కారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చింది.. ధర్మేంద్ర ప్రదాన్తో రాజీనామా చేయించింది.
అప్పుడు పెరిగింది అసలైన చర్చ. ఎవరీ సీజేసీ, ఎవరీ పిల్ల నాయకులు.. ఎవరీ కుర్రాళ్లు,, ఎవరీ అమ్మాయిలులు అంటూ అందరూ చూశారు. కొందరైతే వీరి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా చేరిందని.. లెఫ్ట్ కూడా ఇన్ వాల్వ్ అయిందని చెప్పుకుంటున్నారు. అయితే కదిలిన యువత గుండెల్లో మాత్రం జ్వాల రగిలించింది సమస్య మాత్రమే. అందుకే అది అంత సిన్సియర్ గా అంత సివియర్ గా దూసుకెళ్లింది.
ఇక ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్పులు బయటపడ్డాయనే ఆందోళన మొదలైంది. జ్ఞానేశ్వర్ కుమార్ అధికార దుర్వినియోగం చేశారని.. మోదీకి అనుకూలంగా పని చేశారని రితికా చోప్రా అనే జర్నలిస్టు పరిశోధనాత్మక కథనం ఇచ్చింది. మళ్లీ అగ్గి రాజుకుంది. అయితే ఈసారి రాజకీయ రంగు పులుముకుంది.
కాంగ్రెస్ ఈ ఆందోళనను హైజాక్ చేయాలని.. క్రెడిట్ పొందాలని చేసిన ప్రయత్నం కనపడింది. గాంధీ కుటుంబం నుంచి మొదటిసారి రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్ధితులను కల్పించిన క్రెడిట్ మాత్రం కాక్రోచ్ లదే. మొదటి సమస్య ఎమోషనల్.. కాని ఈసారి అది పొలిటికల్. అందుకే కాస్త తడబాటు కనపడింది. అయితే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల్లో అయితే ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఈసారి అణచివేయకపోతే ఇంకెవరో రాజీనామా చేయాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనపడింది.
ఎందుకంటే దేశమంతా సీజేపీ దూకుడుకు మద్దతు పలుకుతున్నారు. అడిగే సమస్య జెన్యూన్ అయినప్పుడు వారి ఆందోళనలో తప్పేంటనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇది ప్రమాదకరం అనుకున్న కేంద్రం ఈసారి నిర్బంధం ప్రయోగించింది. మెట్రో ఆపేయడం.. కండీషన్లు పెట్టడం వంటివి చేసింది. అయినా కాక్రోచ్ లు ఆగలేదు.. వెనక్కి తగ్గలేదు. ఏమైనా మొదటిసారి జరిగినంత ఉధృతం కూడా కనపడలేదు.
ఎందుకు చేసినా.. ఏం చేసినా ఈ మార్పు చాలా మంచిది.. ఆహ్వానించ దగ్గది. యూత్ అంతా క్లబ్బులు, పబ్బులు తిరుగుతున్నారని.. వారికి వీకెండ్స్ సరదాలే ముఖ్యమని.. మొబైల్స్, ల్యాప్ టాప్ ల్లోఏ తలకాయ పెట్టుకుంటున్నారని అని వస్తున్న విమర్శలన్నీ ఈ ఆందోళలనలతో వెనక్కి పోయాయి.
పెద్దలు సైతం ముందు ఉలిక్కిపడ్డ.. ఇప్పుడు వారికి కూడా బాధ్యత తెలిసిందని ఆనందపడుతున్నారు. అడిగేవాడు లేకపోతే ఏలేవాడు ఎంత దూరమైనా పోతాడనేది అందరికీ తెలిసిందే. ఆ అడిగివాడు యువకుడు, యువత అని తెలిశాక జనం హ్యాపీ ఫీలవుతున్నారు. ఎందుకు వదిలేయాలనే వారి ప్రశ్న కరెక్టే కదా అంటున్నారు. అంతేకాదు ఈ యువత ఎనర్జీని పక్కదారి పట్టకుండా, సరైన దారిలో ఇలాగే దూసుకుపోతే ఇండియాకు మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు.
