ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి జి. అర్చన సోమవారం తీర్పు వెల్లడించారు.
2017లో నమోదైన క్రైమ్ నంబర్ 43/2017 కేసులో తమిళనాడుకు చెందిన ఎన్.ఆర్. మణి, ముత్తు పొన్నుసామి నిందితులుగా ఉన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలో వీరిని అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంలో కీలక పాత్ర పోషించారు. నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ అభినందించారు.
