న్యూఢిల్లీలో నిర్వహించిన ఐయూకేఎల్ ప్రపంచ కెటిల్‌బెల్ ఛాంపియన్‌షిప్–2026లో పతకాలు సాధించిన తిరుపతి క్రీడాకారులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందించారు. సోమవారం విజేతలను దుశ్శాలువలతో సత్కరించారు. తిరుపతిని క్రీడా హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
పది దేశాలకు పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 12 బంగారు, ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించింది. తిరుపతికి చెందిన నమ్రత వాకా, నిహారిక రుద్రరాజు తలో మూడు బంగారు పతకాలు గెలుచుకున్నారు. జీలాని బాషా, ఈ.కె.కె. వనజ తలో రెండు బంగారు పతకాలు సాధించారు. కోచ్, క్రీడాకారుడు మునీర్ షేక్ ఒక బంగారు పతకం గెలుచుకోగా, విష్ణవి మండలం వెండి పతకం, వివేక్ చౌదరి కాంస్య పతకం సాధించారు. విజేతల ప్రతిభను ఎమ్మెల్యే ప్రశంసించారు.
