పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో తన సతీమణి రమాదేవితో కలిసి టిడ్కో ఇళ్లను ప్రారంభించి, 332 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, చీరలు, మిఠాయిలు పంపిణీ చేశారు.
గతంలో అసంపూర్తిగా మిగిలిన గృహ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనంగా రూ.4,500 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చి 31 నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.
నెల్లూరులో 155 ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని, మరో 177 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు రుణాలు కల్పిస్తామని వివరించారు. ఇప్పటివరకు 1,724 మందికి రుణాల మంజూరు పూర్తయిందన్నారు. ఖాళీగా ఉన్న మరో 1,156 ఫ్లాట్లను అర్హులకు పారదర్శకంగా కేటాయిస్తామని తెలిపారు. నగరంలో పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధికి సుమారు రూ.900 కోట్లతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
