ఏపీ పాలిటిక్స్‌లో ఎన్డీఏ కూటమి ఐక్యతపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తు ధర్మాన్ని ఎలాంటి రెండో ఆలోచనలు లేకుండా క్షేత్రస్థాయి వరకు అందరూ పాటించాల్సిందేనని బాబు తేల్చిచెప్పారు. కూటమి అధికారిక కేండిడేట్స్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన రెబల్ కేండిడేట్స్‌ను ఎలాంటి ఉపేక్ష లేకుండా వెంటనే పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తాజా పొలిటికల్ పరిణామాలపై లోతైన చర్చ జరిగింది.
ఈ భేటీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎంతో శ్రమించి సజావుగా సీట్ల సద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల్లోకి కూటమి ఐక్యతపై ఇప్పటికే సానుకూలంగా బలమైన సందేశం వెళ్తుందన్నారు.
కాబట్టి ఓటర్లు వ్యక్తులను కాకుండా ఎన్డీఏ కూటమిని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని కోరారు. ఈ భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేతలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు.
అలాగే మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన టార్గెట్లు విధించారు. కేవలం సొంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, తాము ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న జిల్లాల్లోని అన్ని స్థానాల్లో ఎన్డీఏ కేండిడేట్స్‌ను గెలిపించే పూర్తి బాధ్యతను మంత్రులే తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత వెంటనే పంచాయతీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) ఎన్నికలు రాబోతున్నాయని, దానికి ఇప్పటి నుంచే రెడీ కావాలని సూచించారు. ఏవైనా అంతర్గత విభేదాలు ఉంటే వెంటనే మనలో మనమే కూర్చుని పరిష్కరించుకోవాలన్నారు. ఆ తర్వాత పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే మాత్ర కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
