దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రామ్‌లీలా మైదానంలో ఇకపై నిరసనలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించడం మరింత కఠినతరం కాబోతోంది. ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఢిల్లీ పోలీసులు ఒక ప్రామాణిక నిర్వహణ విధానం ముసాయిదాను రూపొందించారు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిన ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.
ఈ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం రామ్‌లీలా మైదానంలో జరిగే ఏ కార్యక్రమానికి అయినా గరిష్ఠంగా 50,000 మంది మాత్రమే హాజరయ్యేలా పరిమితిని విధించారు. మైదానం సామర్థ్యం ఉన్నా కూడా సభ స్వభావం, భద్రతా అవసరాలను బట్టి ఎంత మందిని అనుమతించాలి అనేది సంబంధిత అధికారి మాత్రమే డిసైడ్ చేస్తారు.
అంతేకాకుండా సభల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే కేవలం ఏడు గంటల వ్యవధికి మాత్రమే సభా సమయాన్ని పరిమితం చేశారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించడానికి కనీసం 10 రోజుల ముందే ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు హస్తిన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వేదిక లభ్యత ధ్రువీకరణ పత్రాన్ని దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే నిరసనల సమయంలో భద్రత విషయంలో కూడా పోలీసులు చాలా ఆంక్షలను విధించారు. సభలకు వచ్చేవారు ఎలాంటి ఆయుధాలు, మండే పదార్థాలు తీసుకురావడంపై నిషేధం అమలులో ఉంటుంది. ఒకవేళ కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ కోసం డ్రోన్లను వాడాలంటే ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
అలాగే అత్యవసర వాహనాలు వెళ్లే రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా బ్లాక్ చేయకూడదని స్పష్టం చేశారు. అయితే ఇటీవల జంతర్ మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగించిన హస్తిన పోలీసులు, దానికి ప్రత్యామ్నాయంగా గుర్తించిన రామ్‌లీలా మైదానం, బురారీ, సీబీడీ గ్రౌండ్స్‌కు అనుమతి ఇచ్చారు. కాగా ఇప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ సభాస్థలిలో కూడా కఠిన నియమాలను సిద్ధం చేయడంపై చాలామంది మండిపడుతున్నారు.
