ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికల పంచాయతీ జోరందుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం..తాజాగా షెడ్యూల్ విడుదల చేయడంతో పల్లె రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం 13వేల168 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 26వ తేదీన మొదటి విడత ఓటింగ్ జరగనుంది.
అయితే ఈసారి ఎన్నికల హీట్ కంటే కూడా తమ ఊరి అకౌంట్లో పడే కోట్ల రూపాయల నజరానా గురించే ఆయా గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే వర్గపోరులు, పగలు, అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చు చేయడాలు వంటివి పల్లెల్లో కామన్‌గా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం దానికి పూర్తి చెక్ పెడుతూ ఒక మాస్టర్ ప్లాన్ అమలులోకి తెచ్చింది.
ఎవరికి వారే పోటీపడి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు, అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం కనుక చేసుకుంటే ఊరి అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులను ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న అరకొర నిధులకు గుడ్‌బై చెప్పేసి..ఆ ఊరి జనాభా లెక్కల ప్రకారం నజరానాను భారీగానే పెంచేసింది.
దీంతో పల్లెల్లో ఒక్కసారిగా సీన్ పూర్తిగా మారిపోయింది. 5 వేల లోపు జనాభా ఉన్న చిన్న గ్రామాలు ఏకగ్రీమైతే ఏకంగా రూ. 15 లక్షలు డైరెక్టుగా అందుతాయి. ఇక 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న మీడియం సైజ్ పంచాయతీలకు రూ. 25లక్షల నజరానా దక్కుతుంది. అదే పది వేలు దాటిన పెద్ద పంచాయతీల లెక్కలకు వస్తే, ఏకంగా రూ. 50 లక్షల భారీ ప్రైజ్ మనీని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రేంజ్ అమౌంట్ చూశాక ఊరి పెద్దలు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆలోచన పడ్డారు. ఎన్నికల్లో నిలబడి గెలిచినా కూడా అప్పులే మిగులుతాయి తప్ప ఒరిగేదేమీ లేదని గ్రహించిన చాలా మంది, ఈ ఎన్నికలకు ఏకగ్రీవమే కరెక్ట్ రూట్ అని ఫిక్స్ అయ్యారు. ఎలక్షన్ల గొడవలు పక్కన పెట్టి, ఈ రూ. 50 లక్షలతో ఊరిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయించుకుంటే బెటర్ అని గ్రామాల్లో పంచాయతీలు నడుపుతున్నారు. మొత్తానికి ఈ ప్లాన్ పల్లెల్లో ఎన్నికల హీట్‌ను తగ్గించి, ఏకగ్రీవాల వైపు చూసేలా చేస్తోంది. ఈ భారీ నజరానాని ఏ గ్రామాలు కొల్లగొడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
