ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండువగా సాగుతున్నాయి. దసరా నవరాత్రులలోనే అత్యంత పవిత్రమైనదిగా భావించే మూలా నక్షత్రం వేడుక సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. సీఎం రాక అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కొండపై అత్యున్నత స్థాయి భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కలిగేలా దుర్గమ్మ ఆలయ పాలకమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మూలా నక్షత్రం రోజు ప్రతీ క్యూలైన్లోనూ ఉచిత దర్శనాలనే అమలు చేయాలని నిర్ణయించారు. రద్దీ కంట్రోల్ కోసం అంతరాలయ దర్శనాలతో పాటు అన్ని రకాల ప్రోటోకాల్, వీఐపీ, సిఫార్సు దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు.భక్తులందరికీ ముఖమండపం నుంచే సరస్వతీ దేవి రూపంలో అలంకరించబడిన కనక దుర్గ అమ్మవారి దివ్య మంగళ స్వరూప దర్శనం లభించబోతోంది. మరోవైపు ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ జామ్ సమస్య రాకుండా ఉండటానికి ప్రైవేటు వాహనాల రాకపోకలపై సంపూర్ణ నిషేధాన్ని విధించారు. ఇప్పటికే జారీ చేసిన సర్వీస్ పాసులతో పాటు అన్ని రకాల వెహికల్ పాసులను టెంపరరీగా హోల్డ్లో ఉంచుతూ, కేవలం ఎమర్జెన్సీ అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
