శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ కళారూపాలతో భక్తులను ఆకట్టుకున్నారు. జానపద నృత్యాలు, సంప్రదాయ సంగీతం, రంగురంగుల వేషధారణలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 477 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
ఉత్తరాంధ్రకు చెందిన తప్పెటగుళ్లు, అరకు ప్రాంత గిరిజన నృత్యం థింసా, తమిళనాడుకు చెందిన కురవంజి, అస్సాం ప్రసిద్ధ బిహూ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటక తీర ప్రాంత సంప్రదాయ కళారూపాలు కూడా భక్తులను అలరించాయి.
లయబద్ధమైన అడుగులు, జానపద సంగీతంతో కళాకారులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు. ఈ ప్రదర్శనలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు వివిధ ప్రాంతాల జానపద కళలకు ప్రోత్సాహాన్ని అందించాయి.
