ఎలక్షన్స్ టైమ్‌లో సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే విషయంలో టీడీపీ చాలా క్లారిటీగా ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమి పొత్తులను కూడా లెక్కచేయకుండా సొంత గూటిలోనే కుమ్ములాటలకు తెరలేపిన ఏడుమందిని టీడీపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి రెబల్స్‌గా పోటీకి దిగిన వారితో పాటు వారికి వెనుక ఉండి నడిపిస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఈ సస్పెన్షన్ ద్వారా హైకమాండ్ అందరికీ మెసేజ్ పంపింది.
లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగానే బరిలోకి దిగుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని డివిజన్లను మిత్రపక్షాలకు కేటాయించడం కామన్. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న లోకల్ లీడర్స్‌కు కొన్ని చోట్ల సీట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వెళ్లగక్కింది. అధిష్ఠానం బుజ్జగింపులను కూడా లెక్కచేయకుండా బరిలో నిలిచిన కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ), కొమ్మినేని సురేశ్, మాదాల సత్యవతి నామినేషన్లు వేయడంతో.. ఇప్పుడు పెద్ద రచ్చగా మారాయి.
పార్టీ అఫీషియల్ కేండిడేట్స్‌కు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారనే సమాచారంతో ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. బాబీకి మద్దతుగా నిలిచిన దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్‌ను కూడా పార్టీ నుంచి బయటకు పంపారు. ఎన్నికల సమయంలో కూటమి విజయమే ఫస్ట్ టార్గెట్ అని భావిస్తున్న ఈ సమయంలో ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని అధిష్టానం తేల్చిచెప్పింది. మొత్తంగా ఈ సస్పెన్షన్ల పర్వం ఇప్పుడు విజయవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
