హస్తం పార్టీలో కాక రేపే మరో పొలిటికల్ వార్తలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నేతలయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటూ బీజేపీ గట్టిగా ఆరోపిస్తోంది.
తాజాగా ప్రియాంక గాంధీ కుమారుడు, ఫోటోగ్రాఫర్ రైహాన్ వాద్రా ఆర్ట్ ఎగ్జిబిషన్లో వివాదం తలెత్తగా.. దానికి రాహుల్ గాంధీ ఏ మాత్రం స్పందించకపోవడమే ఈ అనుమానాలకు బలమైన కారణమని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు.
ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో రైహాన్ వాద్రా.. నో ఐడియా ఈజ్ ఫైనల్ పేరుతో 105 ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ ఎగ్జిబిషన్ కొన్ని గంటల ముందే దానిలోని 74 ఫోటోలు తీసేయాలని లేదా మార్చాలని నిర్వాహకులు చెప్పడంతో కేవలం 35 ఫోటోలు మాత్రమే మిగిలాయి.
దీనిపై ప్రియాంక గాంధీ రియాక్ట్ అవుతూ యువత గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. అయితే పర్సనల్ పర్యటన కోసం వియత్నాం వెళ్లిన రాహుల్ గాంధీ మాత్రం ఈ వివాదంపై చిన్న కామెంట్ కూడా చేయలేదు.
ఇప్పుడు ఈ విషయాన్నే టార్గెట్ చేసిన బీజేపీ నేతలు.. రాహుల్ సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే అసలు రాహుల్ గాంధీపై ప్రియాంకకు నమ్మకం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని పక్కనపెట్టి తన కుమారుడు రైహాన్‌ను రాజకీయ అరంగేట్రం చేయించడానికే ప్రియాంక ఈ ఇష్యూని కావాలని పెద్దది చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, ఈ వివాదం వెనుక కొన్ని అసలు రహస్యాలు ఉన్నాయంటూ.. కొన్ని ఆధారాలను, ఈమెయిల్ స్క్రీన్షాట్లను కూడా బీజేపీ నేతలు బయటపెట్టారు. జూన్ 10వ తేదీన రైహాన్ టీమ్ పంపిన ప్రతిపాదనలో ప్రకృతి, వన్యప్రాణులు, శిల్పాలు వంటి అంశాలు మాత్రమే ఉన్నాయని, ఎక్కడా కూడా రాజకీయాల ప్రస్తావన లేనే లేవని చెప్పుకొచ్చారు. దానిపైన అంగీకారం పొందిన తర్వాత, గాంధీ ఫ్యామిలీ ఒత్తిడితో అక్టోబర్‌లో హఠాత్తుగా పొలిటికల్ ఫోటోలు చేర్చారని, అందుకే బికనీర్ హౌస్ యాజమాన్యం తమ నిబంధనల ప్రకారం ఆ ఫోటోలను అడ్డుకుందని విమర్శించింది.
అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇష్యూ గురించి ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి కనిపించినా.. ఇప్పుడు ఈ ఫోటో వివాదంతో కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది.
