వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీలో సాగుతున్న రచ్చ ఇప్పుడు పోలీసు కేసులతో మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆయన కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ కలిసి ప్రయాణిస్తున్న కారును ఇటీవల ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఇది కేవలం అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదని, తమ ప్రాణాలను తీయడానికి జోగి రమేశ్ ప్లాన్ చేసిన కుట్ర అయి ఉండొచ్చని అనుమానిస్తూ మేఘన తండ్రి కృష్ణ పోలీసులను ఆశ్రయించడమే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అక్టోబర్ 15వ తేదీన విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు మేఘన, ఆమె తండ్రి కారులో బయలుదేరారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు పాక్షికంగా దెబ్బతింది. అయితే ఇది సాధారణ ప్రమాదం లాగా కనిపిస్తున్నా కూడా తమను టార్గెట్ చేసి జరిపిన దాడిగా అనుమానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 16వ తేదీన ఫిర్యాదు చేశారు.
తమకు జోగి రమేశ్ ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని, దీని వెనుక జోగి రమేశ్ హస్తం ఉందేమో తేల్చాలని అలాగే బస్సు డ్రైవర్‌పైన కూడా చర్యలు తీసుకోవాలని మేఘన తండ్రి కోరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇది మామూలు ప్రమాదం లాగే కనిపిస్తోందని, కావాలని చేసినట్లు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
ఇక జులైలోనే జోగి రమేశ్ కుటుంబంపై మేఘన గృహహింస, వరకట్న వేధింపులతో పాటు హత్యాయత్నం కింద తీవ్రమైన ఆరోపణలను చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2025 మేలో జరిగిన పెళ్లికి తమ ఇంట్లో రూ.5 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అదనంగా మరో రూ.5 కోట్లతో పాటు కారు, బంగారం తేవాలని భర్త జోగి రాజీవ్, మామ జోగి రమేశ్, అత్త శకుంతల వేధిస్తున్నారని ఆమె కేసు పెట్టింది.
గతంలో ఘట్కేసర్, గోవాలో కూడా తనపై హత్యాయత్నం చేశారని మేఘన.. గవర్నర్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే ఈ ఆరోపణలను జోగి రమేశ్ కుటుంబం ఖండిస్తూ.. ఇదంతా తమపై జరుగుతున్న రాజకీయకుట్ర అని చెబుతోంది. కాగా ప్రస్తుతం పోలీసులు పాత వేధింపుల కేసుతో పాటు ఈ కొత్త ప్రమాదం ఘటనపై కూడా దర్యాప్తును వేగవంతం చేశారు.
