ఎన్నికల పోరులో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని మనందరికీ తెలిసిందే. బ్యాలెట్ పేపర్ లేదంటే ఈవీఎమ్‌పై ఉండే గుర్తులలో వచ్చే స్వల్ప తేడాలు కూడా అభ్యర్థుల గెలుపోటములను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ అంశాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్థానిక పోరులో ఈ విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.
జనసేన పార్టీ వర్గాలు చేసిన అఫీషియల్ రిక్వెస్ట్‌ను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్, స్వతంత్రులకు కేటాయించే ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి బకెట్, పెన్ స్టాండ్ గుర్తులను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు వెల్లడించి జనసేన పార్టీకి గుడ్ న్యూస్ వినిపించింది.
తమ పార్టీ అధికారిక గుర్తు అయిన గాజు గ్లాసుకు, బకెట్, పెన్ స్టాండ్ సింబల్స్‌కు చాలా దగ్గర పోలికలు ఉండటం వల్ల ఓటింగ్ సమయంలో చాలామంది ఓటర్లు తీవ్ర అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని జనసేన ప్రతినిధులు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గత ఎలక్షన్స్‌లో ఇలాంటి గుర్తు పోలికల వల్ల ఓట్లు చీలిపోయిన అనుభవాలను ఉదాహరణగా చూపించి.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
జనసేన లేవనెత్తిన ఈ వాదనలోని నిజా నిజాలను సమీక్షించిన ఎస్ఈసీ, ఓటింగ్ ప్రాసెస్‌లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఉండటానికి ఈ రెండు గుర్తులను టెంపరరీగా బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా పనిచేస్తున్న రిటర్నింగ్ అధికారులంతా.. స్వతంత్ర అభ్యర్థులకు సింబల్స్ కేటాయించేటప్పుడు ఈ రెండింటిని లిస్ట్ నుంచి మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
