ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన మొదటి రోజే నామినేషన్ల హీట్ ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు వేయడానికి టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నామినేషన్ కేంద్రాల వైపు దూసుకురావడంతో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఘర్షణకు దారి తీసింది.
రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులు, పార్టీ కేండిడేట్స్తో కలిసి భారీ కాన్వాయ్తో నామినేషన్ల కేంద్రానికి చేరుకోవడమే ఇక్కడ వివాదానికి కారణమైంది. ఆయన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లడానిక ప్రయత్నించడంతో అక్కడున్న భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో జరిగిన తోపులాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ గాయపడటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పెరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడే ఆందోళనకు దిగారు.
దీంతో రెండు వర్గాల మధ్య మరింతగా ఘర్షణ చెలరేగి ఏకంగా పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడే వరకూఅక్కడి పరిస్థితి వెళ్లింది. ఎస్ఎన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో కాసేపు రాళ్లవర్షం కురిసింది. ఆందోళనకారులు కొన్ని కార్లకు నిప్పు కూడా పెట్టడంతో వాహనాలు తగలబడి బూడిదయ్యాయి.
ఈ రాళ్లదాడిలో పుంగనూరు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు మధు రాయల్తో పాటు కొంతమంది నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేయడంతో కానిస్టేబుల్ పెంచలయ్య గాయపడ్డారు. దీంతో అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి స్థానికంగా పోలీసు బలగాలను అదనంగా రంగంలోకి దించి..అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
