పవన్ ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. చివరకు వ్యూహకర్తలు కూడా పవన్ స్ట్రాటజీని అంచనా వేయలేకపోతున్నారు. నచ్చనివాళ్లు తిడుతున్నారు.. అభిమానించేవారు మాత్రం ఆయన ఏం చేసినా బాగు కోసమే అని వాదిస్తున్నారు. ఆఖరికి చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ కూడా పవన్ ను డీల్ చేయలేకపోతున్నారని కామెంట్లు వస్తున్నాయి. సిట్యుయేషన్ ని అడ్డు పెట్టి తన బలాన్ని పెంచుకోవడంలో పవన్ ఏపీలో ఏ నాయకుడితో పోలిక లేని విధంగా తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు.
ఒకప్పుడు ఏం చేయాలో అర్ధం కాక, ఓటమిని ఎదుర్కొన్న ఆ పవన్ ఈ పవన్ ఒకరేనా అని ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు జనసేనకు క్యాండిడేట్లు ఎవరో తెలియని పరిస్ధితి నుంచి ఈ రోజు క్యాండిడేట్లు వారి వెనక కేడర్ అందరూ వచ్చేలా చేసుకోవడం ఆశ్చర్యకరంగానే ఉంది. పైగా జనసేనలో పవన్ టీడీపీకి దాసోహం అయ్యారు.. లొంగిపోయారు అనే అసంతృప్తి నుంచి ఈరోజు ఎస్ పవన్ టీడీపీ మెడలు వంచారని చెప్పుకునేదాకా తీసుకెళ్లారు. ఇప్పటికీ చాలామంది పవన్ వైఖరిని తప్పుబడుతున్నారు. కాని ఉన్న పరిస్ధితుల్లో నేను చేయగలిగింది చేస్తున్నా… తగ్గాల్సిన దగ్గర తగ్గాలి.. మనకు నచ్చకపోతే మౌనం.. అవకాశం వచ్చినప్పుడు దూకుడు ఇలా డిఫరెంట్ వర్షన్స్ తో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎవరికీ అంతుపట్టకుండా వ్యవహారం నడిపించేస్తున్నారు.
మొన్నటి వరకూ పవన్ సైలెంట్ అయిపోయారనే కామెంట్లు వచ్చాయి. గతంలో జగన్ అనే విలన్ కేరెక్టర్ ముందు పెట్టి ఆవేశంగా దూసుకుపోయారని.. ఇప్పుడా పరిస్ధితి లేదు కాబట్టే ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖల్లో పనితీరు మంచిగా చూపించడం,, మంచి టీమ్ ను పెట్టుకోవడం.. ఆయా డిపార్టుమెంట్లలో అవినీతిని సాధ్యమైనంతవరకు లేకుండా చేసుకోవడం ఇవన్నీ పవన్ పనితీరుకు నిదర్శనం అంటున్నారు. ఇవన్నీ చేస్తూనే లోకల్ బాడీ టైమ్ రాగానే తనలోని పొలిటీషియన్ ను బయటకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
ఇప్పుడు ప్రచారం జరుగుతున్నదాన్ని బట్టి నాదెండ్ల మనోహర్‌కు పవన్ కొన్ని కంట్రోల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో మనోహర్‌పై ఈగ వాలినా ఊరుకోనన్న పవన్.. ఆ రోజు ఏ విమర్శలు వచ్చాయో అవన్నీ పరిశీలించి ఈ రోజు పార్టీ వ్యవహారాల్లో మనోహర్‌ను పక్కన పెట్టారంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాలు, కూటమిలో కోఆర్డినేషన్ బాధ్యతలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులు, కమిటీలు అన్నీ మాత్రం జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్ ద్వారానే చేసుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో అసంతృప్తిగా ఉన్న కేడర్ , నేతలు అందరూ సంతృప్తి చెందడమే కాకుండా.. వారంతా తాళ్లూరి రామ్‌ను రెగ్యులర్‌గా కలవడం మొదలెట్టారు.
దీని వలన కొన్ని క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా రామ్ ద్వారా పవన్‌కు చేరుతున్నాయంటున్నారు. అంటే బహిరంగంగా ఉన్నప్పుడు పార్టీకి డ్యామేజ్ లేకుండా, నేతల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవడం… అంతర్గతంగా మాత్రం పార్టీ కార్యకర్తలు మనోభావాలను పట్టించుకోవడం అనేది పవన్ వ్యూహాత్మక వైఖరిని తెలియచేస్తుంది. అంతే కాదు నిర్మాణం సరిగా లేదు.. ఆర్గనైజేషన్ నడపటం రాదు అనే విమర్శలను ఏమీ పట్టించుకోనట్లే ఉంటూ.. ఇప్పుడు ఆ లోపాలను సరి చేసుకునే ప్రయత్నం చేయడం కూడా కొందరు నేతలకు షాకింగ్ గా ఉంది.
టీడీపీకి తొత్తు.. బాబు పదిహేనేళ్లు సీఎం ఏంటి అంటూ దాసరి రాము లాంటి వారు మాటల దాడి చేస్తే ఏం చేస్తామన్నట్లు రెస్పాండ్ అయి… తర్వాత తన ఆచరణలో అవన్నీ తప్పని నిరూపించేలా అడుగులు వేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పొత్తు విషయంలో గట్టిగా ఉండటమే కాదు.. అవసరమైతే సొంతంగా పోటీ చేస్తామనే సిగ్నల్స్ కూడా ఇచ్చి టీడీపీని భయపెట్టినట్లు తెలుస్తోంది. మొదటిసారిగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తామే బయటికి వచ్చామని చెప్పడం ద్వారా వ్యూహాత్మకంగా టీడీపీకి జనసేన అవసరం అనే విషయాన్ని నొక్కి చెప్పారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో 8 అడిగితే 4, 6 అడిగితే 3 అనేది కామన్.. అయినా గాని ఒత్తిడి పెంచి ఎంతో కొంత షేర్ పెంచుకోవడంతో పవన్ వ్యూహం సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు.ఈ విషయంలో ఇప్పుడు టీడీపీ కేడర్‌లో అసంతృప్తి మొదలైంది. మొన్నటివరకు జనసేన కేడర్‌లో ఉన్న కోపం.. ఇప్పుడు ఇటు టర్న్ అయింది. ఒకవైపు జగన్ మళ్లీ పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో.. ఆ థ్రెట్ ఇంకా ఉందనే అంచనాతోనే పవన్ షేరింగ్‌ను యాక్సెప్ట్ చేసే తప్పని పరిస్ధితి చంద్రబాబుకు ఏర్పడుతుంది అనటంలో సందేహం లేదు.
మరోవైపు నేతలను చేర్చుకోవడంలో కూడా పవన్ తన స్టయిల్ చూపిస్తున్నారు. వంగవీటి రాధా టీడీపీ నుంచి ఇప్పుడు జనసేనకు రావడంలో కొందరు జనసేన నేతలకు అసంతృప్తి కలిగించింది. కాని ఎప్పుడూ అవాయిడ్ చేసిన పవన్ ఇప్పుడు కలుపుకోవడానికి కారణం సామాజిక ఈక్వేషన్లు అంటున్నారు. కాపుల్లో చీలిక లేకుండా మరోవైపు చూడకుండా జనసేన వైపు చూసేలా చేసుకోవడం ఈ ఎత్తుగడ వెనక ఉద్దేశం అంటున్నారు. పైకి మాత్రం కులాన్ని పట్టించుకోనని చెప్పడం పవన్ లౌక్యం అనుకోవాలి.
21 సీట్లే ఒప్పుకున్నారని తిట్టించుకున్న పవన్ తాడేపల్లిగూడెం సభలో తన ఎమోషనల్ స్పీచ్ తో మొత్తం లాగేశారు. అందరూ కన్విన్స్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీకి లొంగిపోయారనే విమర్శకు లోకల్ బాడీ ఎన్నికల్లో చూపించిన వ్యవహారశైలితో పోయింది. పవన్ కళ్యాణ్ తమ పక్కన ఉంటే పార్టీకి ఎప్పటికైనా ప్రమాదమే అనే అంచనా టీడీపీలో పెరిగింది. ఇటు మనం సొంతంగా అయినా ఎదుగుతాం అనే కాన్ఫిడెన్స్ జనసేనలో పెరిగింది.
మొత్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నిటిని గమనిస్తున్న జనసేన కేడర్‌లోనూ, అభిమానుల్లోనూ, పవన్ ప్రత్యర్ధుల్లోనూ, మిత్రుల్లోనూ ఆశ్చర్యాన్ని పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను తక్కువగా అంచనా వేయటానికి లేదనే ఏకాభిప్రాయానికి అందరూ వచ్చేశారు. ఎప్పటికప్పుడు తన వైఖరి మార్చుకుంటూ తనను తాను ఓ పజిల్ లా పోర్టరేట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
