మూడేళ్ల కిందట రిలీజైన జైలర్ సినిమాతో అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసి, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ మరోసారి ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పట్లో క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్‌ను ..ఈ సీక్వెల్ ఇప్పుడు రిపీట్ చేసిందా లేదా అనే క్యూరియాసిటీ ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది.
స్టోరీ విషయానికి వస్తే, తన కొడుకును కోల్పోయిన తర్వాత ఓ సూపర్ మార్కెట్లో పని చేసుకుంటూ ఉండే ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్)లైఫ్‌లోకి మరోసారి గ్యాంగ్ వార్ గండం వచ్చిపడుతుంది.
ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన విలన్.. వర్మ వెనుక ఉన్న బడా స్మగ్లింగ్ మాఫియా ముఠాలన్నీ అసలు హంతకుడిని వెతుకుతూ జైలర్‌ను టార్గెట్ చేస్తాయి. గోవా సెంటర్‌గా నడిచే నేర సామ్రాజ్య వారసులు బోధి కల్పక్ (ఎస్జే సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) తో జైలర్ ఎలా పోటీ పడ్డాడు.. తన ఫ్యామిలీని ఆ భారీ సిండికేట్ నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్.
సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, డైరెక్టర్ నెల్సన్ డార్క్ కామెడీ అండ్ మాస్ ఎలివేషన్స్ పిచ్ మీద అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్‌గా ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే నెక్స్ట్ లెవెల్లో దూసుకెళ్తుంది. ప్రతి పావుగంటకు ఒక హై మూమెంట్ ఇస్తూ థియేటర్లలో ఆడియన్స్ ఈలలు వేసేలా చేయడంలో నెల్సన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
డాన్ మూర్తి పాత్రలో నమో నారాయణ చేసే కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తే, ఇంటర్వెల్ బ్లాక్ ఏకంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్ డ్రామా క్వాంటిటీ పెరగడంతో మూవీ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే వెంటనే ఒక రేంజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో గ్రాఫ్‌ను మళ్లీ పైకి లేపాడు.
సినిమా రన్‌టైమ్ సుమరా మూడు గంటలు ఉండటం వల్ల సెకండాఫ్‌లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా, క్లైమాక్స్‌లో హృతిక్ రోషన్ ఎంట్రీ అండ్ పార్ట్ 3 ఉండబోతోందనే హింట్ మూవీపై అంచనాలను పెంచేస్తుంది. రజనీ వింటేజ్ స్వాగ్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. మొత్తానికి తలైవా ఫ్యాన్స్‌కు ఇదొక పర్ఫెక్ట్ మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
