వంగవీటి రంగాకు ఎంత ఇమేజ్ ఉందంటే .. చనిపోయిన 38 ఏళ్లకు కూడా కొడుకు, కూతురికి ఉపయోగపడేంత ఉంది. మార్గాల్లో తప్పు ఒప్పులు ఎన్ని ఉన్నా రంగా జనం కోసమే పని చేశారు. అందుకే ఆయనకు అంత ఇమేజ్. ఎన్ని వ్యాపారాలు చేసినా.. ఎంత అవినీతి చేసినా.. ప్రజల్లో నిలబడాలంటే నాయకుడు ఆ ప్రజల కోసం పని చేయాలి. తన సంగతి ఎలా ఉన్నా.. తన ముందుకు వచ్చి కష్టం చెప్పుకునేవాడికి సాయం చేయాలి.. విలువ ఇవ్వాలి. అది లేకపోతే ఆ నాయకుడు కనుమరుగైపోతాడు. రంగా మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు జనంతో ఉంటూ.. జనం కష్టాలు వింటూ ఉండేవాడు. చట్టవ్యతిరేకమైనా సరే .. న్యాయం చేయటానికి చూసేవాడు. అప్పట్లో చట్టాన్ని, పోలీసులకన్నా రంగానే ఎక్కువగా నమ్ముకునేవారు జనం. అందుకే అన్న రాధా కన్నా, ప్రత్యర్ధులు నెహ్రూ కుటుంబం కన్నా కూడా రంగాకే జనం మద్దతు ఎక్కువ. అప్పటికి.. ఇప్పటికి కూడా. అలా ఉంది కాబట్టే.. కొడుకు వంగవీటి రాధా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యాడు.. కాని తర్వాత జనం అంచనాలకు సరిపోలేదు. అందులో రంగాతో కంపేర్ చూసినవారికి అయితే మరింత నిరాశ. ఆ తర్వాత కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా రాధా అందుకోలేదు. అన్నీ తన ముందుకే రావాలి.. తానున్న చోటకే పదవులు నడిచి రావాలన్న కాన్సెప్టుతో చాలా టైమ్ వేస్ట్ చేశాడు. ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు.. తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టుకోలేదు.. తన మాట చెల్లదు.. తనకు విలువ లేదు అనుకుంటే అక్కడి నుంచి వెంటనే తప్పుకునేవాడు. కాకపోతే రాజకీయాల్లో కొనసాగాలంటే జనంలో పని చేయాలనేది మాత్రం మర్చిపోయాడు. అయినా సరే ఈ రోజు విజయవాడ మేయర్ స్థానానికి రాధా పేరు రాగానే బజ్ వచ్చింది. జనసేనకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నా.. ఈ రోజు విజయవాడ మేయర్ కోసం జనసేనలోకి అడుగు పెట్టినా.. ఆ పార్టీ శ్రేణులన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మనోడు మన దగ్గరికి వచ్చాడు అనే కామెంట్లు వినపడుతున్నాయి. ఇవన్నీ కేవలం వంగవీటి రంగాపై అభిమానంతోనే. రాధా వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా అప్పుడప్పుడు తప్పితే ఎప్పుడూ యాక్టివ్ గా లేడు. కేవలం రంగా విగ్రహాల ఆవిష్కరణలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక పక్కన చేరిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు తమ శక్తి మేరకు ఫ్రెండ్ ను డైవర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వారి వల్ల రాధాకు చెడ్డపేరే ఎక్కువ వచ్చింది. అయితే రాజకీయాలకు అతీతంగా, ఎవరు ఎలా ఫీల్ అయినా వారి స్నేహాన్ని వదిలిపెట్టని రాధా మనస్తత్వం కూడా కొందరికి నచ్చింది. అసలు రాంగోపాల్ వర్మ వంగవీటి అనే సినిమాను తీసినప్పుడు.. తన స్టయిల్ లో ఇష్టమొచ్చినట్లు తీసేశాడు. రక్తచరిత్ర 1 పరిటాల హీరో, రక్తచరిత్ర2కి సూరి హీరో.. ఎవరి దానికి వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడనే ప్రచారం ఉంది. అలాంటోడు వర్మ. ఎవడు డబ్బులిస్తే వాళ్లకు అనుకూలంగా చరిత్ర కూడా మార్చేస్తాడు. వంగవీటి కూడా అలాగే చేశాడు. అలాంటి వంగవీటిని రాధా అడ్డుకుంటాడని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. ఒక మీటింగుతో సరిపెట్టి వదిలేశాడు రాధా. అసలైతే ఆ సినిమాను ఆడనీకుండా అడ్డుకుని ఉంటే రాధా ఇమేజ్ ఇంకో రకంగా ఉండేది. ఆ విషయంలో రంగా అభిమానులు అయితే బాగా డిజపాయింట్ మెంట్ అయ్యారు.ఇప్పుడు విజయవాడ మేయర్ అవడం లాంఛనప్రాయమే అని చెప్పాలి. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది.. వైసీపీ వీక్ అయి ఉంది.. పైగా వంగవీటి ఇమేజ్ ఎటూ ఉంది పైగా జనసేన తరపున వస్తున్నాడు కాబట్టి కులం సపోర్టు కూడా గట్టిగా పని చేస్తుంది. ఇప్పటివరకు విజయవాడ కార్పొరేషన్ ను అనధికారికంగా ఎమ్మెల్యే బోండా పెత్తనం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకే ఆయన కొడుకుకి మేయర్ సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారు. బోండా, మల్లాది విష్ణు ఇద్దరూ రంగాతో పని చేసినవారే. కాని బోండాకు, రాధాకు మాత్రం పడదు. విజయవాడ సెంట్రల్ సీటు కోసం రాధా ప్రయత్నించినా వర్కవుట్ అవలేదు. అవటానికి మేయర్ స్థానం అయినా వంగవీటి రాధా విజయవాడ మొత్తం ఏలే అవకాశం వచ్చినట్లే. బోండా డామినేషన్ కు కూడా బ్రేక్ పడొచ్చు. ఈ అవకాశాన్ని వంగవీటి రాధా ప్రజలకు సేవ చేయటానికి, తన తండ్రి మార్గంలో ప్రజలకు దగ్గర అవటానికి వాడుకుంటే.. ఎప్పటికీ చెదిరిపోని ఇమేజ్ సంపాదించుకోవచ్చు రేపు విజయవాడ సెంట్రల్ అయినా, పార్లమెంట్ అయినా దేనికైనా సరైనోడు అనిపించుకుంటాడు. రంగా ఇమేజ్ విజయవాడే కాకుండా కోస్తా జిల్లాలు, సీమ జిల్లాల్లో సైతం ఉంది. అందుకే వంగవీటి రాధాకు అవకాశాలు అనంతం… అందుకోవడమే కావాల్సింది. మరేం చేస్తారో చూడాలి.
