తిరుపతి నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.106 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గొల్లవాణిగుంట పరిధిలోని శ్రీనివాస నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన, నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ భూమిపూజ చేశారు.
ఈ నిధులతో నగరంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, డివైడర్లు, పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ మెరుగైన మౌలిక సదుపాయాలు నగర జీవన విధానాన్ని మార్చుతాయని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
