తిరుమల, అక్టోబరు 12, 2026: తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాల్లో 169 కళాబృందాలకు చెందిన 4,471 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో వాహన సేవల సమయంలో భక్తులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలను వీక్షించడంతోపాటు, టీవీ, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 40 బృందాలకు చెందిన 1,200 మంది కళాకారులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 31 బృందాలకు చెందిన 781 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఖతార్, దుబాయ్, ఆస్ట్రేలియా నుంచి కళాకారులు కూడా పాల్గొననున్నారు. సింగపూర్, జర్మనీకి చెందిన ప్రవాస భారతీయ కళాకారులు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిభ చాటారు.
దాస సాహిత్య ప్రాజెక్టు నుంచి 39 బృందాలకు చెందిన సుమారు 1,000 మంది కళాకారులు పాల్గొననున్నారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలకు చెందిన 59 బృందాల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కళాశాలలో 13 కళారంగాల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
