కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్
- రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం
- 2034 వరకు సీఎం అన్న రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్
- రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. 2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. అని తన ఎక్స్ ఖాతాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేశారు.
https://twitter.com/rajgopalreddy_K/status/1946404726473400569
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించినప్పటికీ అవకాశం రాలేదు. అప్పటి నుంచి పార్టీపైన, సీఎం రేవంత్ పైన గుర్రుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తొలిసారి తన మనసులోమాట బయటపెట్టారు. 2034 వరకు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. రాజగోపాల్ రెడ్డి తీరుతో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న పదవులు రాని నాయకులు సైతం సీఎం రేవంత్ పై విమర్శలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.