తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి వర్సెస్ ఈటెల
* బండి సంజయ్‌పై ఈటెల పరోక్ష విమర్శలు
* కొ*డుకా అని సంబోధిస్తూ హెచ్చరికలు
* సోషల్ మీడియాలో ప్రచారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటన
* ఈటల వాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం
తెలంగాణ బీజేపీ నేతల మధ్య నెలకొన్న వర్గ విబేధాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికకు ముందు రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. ఈటెల బీజేపీలో చేరిన్పటి నుంచే ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా ఆదిపత్యపోరు నడుస్తోంది. తాజాగా అవి తారాస్థాయికి చేరి పరస్పరం విమర్శించుకునే వరకు వచ్చాయి.
హుజూరాబాద్ కు చెందిన బీజేపీ అసంతృప్త నేతలు శామీర్‌పేటలోని ఈటెల నివాసంలో కలిసి స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు తెలంగాణ బీజేపీలో సంచలనం రేపాయి. అసలు నువ్వెవరు, నీ శక్తి ఎంత, నేను 2002లో జిల్లాకు వచ్చాను, మంత్రిగా పనిచేశాను, నేను అడుగుపెట్టని గ్రామం లేదు, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. శత్రువుతో కొట్లాడుతాం.. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు కొ*డుకా’ అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారి వివరాలతో అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఈటెల హెచ్చరించారు. ఇక్కడ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ ని ఉద్దేశించేనని బీజేపీ నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎవరు స్పందించవద్దని.. అధిష్ఠానమే చూసుకుంటుందని బండి సంజయ్ కూడా తన వర్గానికి సూచించారు.
విభేదాలకు కాారణం ఆదిపత్య పోరే
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటెల.. బీజేపీలో చేరినప్పటి నుంచే ఇద్దరి మధ్య సఖ్యత లేదన్న ప్రచారం ఉంది. ఈటెల రాష్ట్రమంత్రిగా, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూ.. అప్పుడు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ని పట్టించుకునే వారు కాదన్న ప్రచారం జరిగింది. దీంతో ఈటెల బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ కుమార్ రాజేందర్‌ను దూరం పెట్టారని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో బండికి తక్కువ మెజార్టీ వచ్చేలా ఈటల వర్గీయులు పనిచేశారని సంజయ్ వర్గీయులు ఆరోపించారు. ఇలా మొదలైన విభేదాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ ఆశించిన సమయంలో.. అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ కు రాకుండా చేయడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాత్ర ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల వ్యాఖ్యలను బండి సంజయ్ పరోక్షంగా తప్పుపట్టారు. ఇది కూడా ఇద్దరి మధ్య మరింత దూరం పెంచిందన్న ప్రచారం ఉంది.
బీజేపీ అధిష్టానం ఏం చేయబోతోంది?
ఇద్దరు ఎంపీల మధ్య నెలకొన్న విభేదాలు బీజేపీ కేంద్ర నాయకత్వ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఈటెల వ్యాఖ్యలపై పార్టీ నేతల స్పందన, అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అధిష్టానానికి పంపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా శామీర్‌పేటలోని తన నివాసంలో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం వస్తోంది. మొత్తం మీద ఇద్దరు రాష్ట్ర అగ్రనేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి ముగింపు ఇస్తుందన్నది చర్చనీయాంశమైంది.