తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్ మెన్
- మేడిపల్లి క్యూ న్యూస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు
- కవితపై అనుచిత వ్యాఖ్యలను తప్పుబట్టిన నేతలు
- దాడిలో పలువురికి గాయాలు
మేడిపల్లి తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీనితో అక్కడే ఉన్న మల్లన్న గన్ మెన్ గాలిలోకి కాల్పులు జరిపాడు. మేడిపల్లి క్యూ న్యూస్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఎమ్యెల్సి కవిత మీద కామెంట్ చేస్తూ ఎమ్యెల్సి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఓ వీడియో చేశాడు. బిసి రిజర్వేషన్లను కవిత సమర్ధించడం జరిగింది. దీనికి కవితకు ఏం సంబంధం అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో కాస్త చిచ్చు రగిల్చింది. దీనితో కోపం పెంచుకున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు మహిళలు, నాయకులు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వారందరిని క్యూ న్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ దాడిలో కొందరికి గాయాలై ఆఫీస్ మొత్తం రక్తసిక్తం అయ్యింది. లోపల ఉన్న మల్లన్న గన్ మెన్లు బయటకు వచ్చారు. అందులో ఒకరు గాల్లోకి కాల్పులు జరపగా, మరొకరు పిస్టల్ తో బెదిరించి ఆందోళన కారులను బయటకు గెంటివేశారు. గన్ మెన్ కాల్పులతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం వేడెక్కింది. మరోసారి కవితపై రిపీట్ అయితే వదిలేది లేదు అంటూ కార్యకర్తలు బెదిరించారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మల్లన్న సీరియస్ అయ్యాడు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పటి కవిత వరకు తనపై దాడి చేసి హత్య చేయాలని పథకం వేశారని ఆయన మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలను పంపి దాడి చేస్తే బెదిరేది లేదని చెప్పాడు. తనను తన సిబ్బందిని రక్షించే ప్రయత్నంలో తన గన్ మెన్ కాల్పులు జరిపాడని స్పష్టం చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మేడిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.