ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!
మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటూ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన నా సోదరి ఆర్‌కె రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.
వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారన్నారు. ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఉన్నత పదవి పొందారంటూ ధ్వజమెత్తారు. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారన్నారు.
https://twitter.com/ysjagan/status/1946547299154616406
ఏడాది కాలంగా అనేక మంది వైఎస్ఆర్‌సీపీ మహిళా నాయకులను దారుణంగా వేధిస్తూ అవమానించడం తగదన్నారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్‌కె రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ నేతలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరచి వ్యవహరిస్తున్నారో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని జగన్ అన్నారు. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికతో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నయని గుర్తు చేశారు.
ఇకనైనా మాజీ మంత్రి ఆర్‌కె రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా కోరారు.