బీహార్‌లో 'కేజ్రీ' పాలిటిక్స్.. ఆ పార్టీకి షాక్..?
* చీలిక దిశగా ఇండియా కూటమి
* కాంగ్రెస్ పార్టీ తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం
* బీహార్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం
* కాంగ్రెస్, ఆర్జేడీలకు భారీ నష్టం తప్పదన్న అంచనా
జాతీయ స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సహా మిత్రపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పేరుకే కూటమి కానీ.. ఎన్నికల నాటికి ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలతో ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ విధానాలు, రాహుల్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ఒక్కొక్క పార్టీ దూరమవుతోంది. ఇప్పటికే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బయటకు వచ్చేసినట్టే కనిపిస్తోంది.
తాజాగా ఆమ్ ఆద్మీపార్టీ కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమైంది. బీహార్ ఎన్నికల్లోనూ ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా కూటమి)తో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికి కారణం గుజరాత్ విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ పోటీ చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇదివరకే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.
ఇప్పుడు ఆప్ ఒంటరిగా పోటీ చేస్తే బీహార్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీలు యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ కూడా ఇదే వర్గాలపై ఫోకస్ చేసింది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బీహార్ ప్రజల వద్దకు ఆప్ వెళ్తోంది. ఆప్ వ్యూహం ఫలిస్తే కాంగ్రెస్ కు భారీ షాక్ తప్పదు.