నరసాపురం లేసుకు జాతీయ అవార్డు..!
* నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు
* వన్ డిస్ట్రిక్ట్...వన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక
* నేడు ఢిల్లీలో అవార్డుల పంపిణీ కార్యక్రమం
* అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందిన నరసాపురం లేస్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ డిస్ట్రిక్, వన్ ప్రొడక్ట్ పథకం కింద 2024-25కు గాను నరసాపురం లేసు పార్కును ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల ఉత్పత్తులు పోటీలో నిలిచాయి. కేంద్రప్రభుత్వ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి మొత్తం 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక చేశారు. ఈ జాబితాలో సీతారామపురం లేస్ పార్క్ కూడా ఉంది. ఈ పురస్కారం అందుకొనేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీ చేరుకున్నారు. ప్రగతి మైదానంలో జరిగే కార్యక్రమంలో ఓడిఓపి అవార్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రిచేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకుంటారు.
నరసాపురం లేసు ఖ్యాతి ఖండాంతరాలకు
ఉభయ గోదావరి జిల్లాల్లో లేసు ఉత్పత్తిదారులు ఉన్నారు. మహిళలు సన్నటి దారంతో అందమైన ఆకృతులను తయారు చేసే లేసు అల్లికలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దాదాపు 250 గ్రామాల్లో 95వేల మంది వరకు ఈ అల్లికలపై ఆదారపడి పనిచేసేవారు. పశ్చిమగోదావరి జిల్లాకు ఎవరు వచ్చినా నరసాపురం లేసు పార్కును సందర్శించి లేసు ఉత్పత్తులను కొనుక్కుని వెళ్తారు. ఈ లేసు అల్లికలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోలిక గుర్తింపు కూడా లభించింది. ఈ అవార్డును కూడా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. లేస్ కు ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించడంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి.